మహాపాదయాత్రకు ప్రజాస్పందన చూసి ప్రభుత్వం భయపడుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. 13వ రోజు గుడివాడలో జరుగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ, మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ ఇతర తెదేపా నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పాల్గొనకుండా రైతులను అడ్డుకుంటున్నారని మద్దతు పలికిన వారిని సైతం అరెస్టులు చేస్తూ ప్రభుత్వం నియంతృత్వ విధానాలు అవలంబిస్తుందని అన్నారు.
హైకోర్టు అనుమతించిన పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని ఐడి కార్డులు ధ్రువీకరణ పత్రాలు అంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అడుగడుగునా రైతు నాయకులను విపక్ష నేతలను అడ్డుకుంటున్నారని, గుడివాడలో రాపిడ్ యాక్షన్ బలగాలు, టియర్ గ్యాస్ లు మోహరించి భయపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. జగన్ రెడ్డి మూడు ముక్కలాటకు కాలంచెల్లిందని కేసులు, దాడులతో అమరావతి రైతుల ఉద్యమాన్ని అడ్డుకోలేరని అన్నారు.