నాగాయలంక మండలం గణపేశ్వరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ దుర్గా గణపేశ్వరస్వామి మరియు శ్రీ పార్వతీ సంగమేశ్వర స్వామివారుల దేవాలయంలో ఈ నెల 26 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని ఆలయ వ్యవస్థాపక దర్మకర్త మండల శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు), ఆలయ కార్యనిర్వహణాధికారి సమ్మెట ఆంజనేయస్వామి తెలిపారు.
దివితాలూకాలో అత్యంత ప్రాచీన ప్రసిద్ధి చెందిన శ్రీ గణపేశ్వరస్వామివారి ఆలయంలో బెజవాడ కనకదుర్గమ్మ తరువాత గణపేశ్వరం గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ నిలువెత్తు విగ్రహం ఈ ఆలయంలో భక్తులు ముందుగా అమ్మవారిని దర్శించిన అనంతరం అయ్యవారైన శివుని దర్శించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి గా భక్తులు భావించి పూజలు చేస్తారు. ఆలయ అర్చకులు పోతుకూచి నాగ వెంకటసాయిశర్మ బ్రహ్మత్వంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేస్తారు.
26న కలశ స్థాపన ప్రత్యేక పూజలు జరుగుతాయి. అమ్మవారు శ్రీ రజిత కృత శ్రీ విజయ దుర్గాదేవి గా భక్తులకు దర్శనమిస్తారు. 27న శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి, 28న శ్రీ గాయత్రీ దేవి, 29న శ్రీ అన్నపూర్ణ దేవి, 30న శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి, 1న శ్రీ మహాలక్ష్మి దేవి, 2న శ్రీ మహాసరస్వతీ దేవి (మూలానక్షత్రం) సందర్భంగా విద్యార్థులచే సరస్వతీ పూజలు జరుగుతాయి. 3న శ్రీ దుర్గాదేవి, 4న శ్రీ మహిషాసురమర్ధిని దేవి, 5న శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. కావున భక్తులు విరివిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించ వలసినదిగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆంజనేయస్వామి కోరారు.