నోట్ల రద్దు రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు రేపు వాదనలు విననున్నది. జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పిటిషన్‌లపై రేపు విచారణ చేపట్టనున్నది. పిటిషన్‌లపై ప్రాథమిక వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తిరిగి సమగ్ర విచారణ చేపట్టబోయే తేదీని ఖరారు చేసే అవకాశం ఉన్నది. ప్రధాని నరేంద్రమోదీ 2016 సెప్టెంబర్ 8న పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. పాత రూ.500 నోటుకు బదులుగా కొత్త నోటును తీసుకురాగా, పాత రూ.1000 నోటును పూర్తిగా రద్దుచేశారు. దాని స్థానంలో రూ.2000 నోటును తీసుకొచ్చారు. అయితే ఈ నోట్ల రద్దు కారణంగా జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు కోసం నిత్యం బ్యాంకుల ముందు బారులు తీరాల్సి వచ్చింది. ఈ క్రమంలో నోట్ల రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్‌లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. 2016, డిసెంబర్ 16న తదుపరి దర్యాప్తును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీచేసింది. కానీ, రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఇప్పటిదాకా సమయం పట్టింది.