పంట రుణాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన కౌలురైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో నేలపై కూర్చోబెట్టిన ఘటన... బాపట్ల జిల్లాలో జరిగింది. కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదంటూ.. కొల్లూరులో బుధవారం కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. అదే మార్గం గుండా మంత్రి మేరుగు నాగార్జున వెళ్లాల్సి ఉండటంతో.. పోలీసులు అత్యవసరంగా వారిని వాహనాల్లో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ రైతులను కూడా నిందితుల మాదిరి నేలపై కూర్చోబెట్టారు. మంత్రి వెళ్లిపోయాక మధ్యాహ్నం 2 గంటలకు సొంత పూచీకత్తుపై కౌలు రైతులను పోలీసులు విడుదల చేశారు. ఖరీఫ్ పంటకాలం ముగుస్తున్నా.. రుణాల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిప్పించుకుకుంటున్నారని.. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు తోడేటి సురేష్ ఆరోపించారు. ఇలాగే వ్యవహరిస్తే బ్యాంకుల ముందే బైఠాయిస్తామని హెచ్చరించారు. ఆందోళనలకు సంబంధించి.. పోలీసులు కేసు నమోదు చేశారు. రాకపోకలకు ఆటంకం కలిగించారంటూ... సురేష్ సహా 9 మంది రైతులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు..