ఇంద్రకీలాద్రి పై అన్నపూర్ణ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈఓ భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ తలసిల రఘురాం, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ దర్శనానికి వచ్చారు. ఆలయ అధికారులు దుర్గమ్మ దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం మంత్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ దసరా ఉత్సవాలలో అమ్మవారిని అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తల్లి దీవెనలు అన్ని వర్గాల ప్రజల పై ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి, సీఎం కు దుర్గమ్మ ఆశిస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.