ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పృథ్వీరాజ్‌కు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ..కోర్టు అలా తీర్పు ఇచ్చింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 01, 2022, 11:56 PM

ఇటీవల ఆ నటుడికి కాలం ఏమాత్రం కలసిరావడంలేదు. ‘థర్డీ ఇయర్స్ ఇండస్ట్రీ’గా టాలీవుడ్‌లో పేరు సంపాదించుకున్న ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌కు విజయవాడ కుటుంబ న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. భార్య శ్రీలక్ష్మికి ప్రతి నెల రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మి-పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాలిరెడ్డి పృథ్వీరాజ్ (శేషు)కి 1984లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీలక్ష్మి 10 జనవరి 2017లో కోర్టును ఆశ్రయిస్తూ.. భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. పెళ్లయిన తర్వాత తన భర్త పృథ్వీరాజ్ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉంటూ చెన్నై వెళ్లి సినిమాల్లో నటించేందుకు ప్రయత్నించేవాడని, ఆ ఖర్చులన్నింటినీ తన తల్లిదండ్రులే భరించేవారని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను తరచూ వేధించేవాడని ఆరోపించారు.


5 ఏప్రిల్ 2016న తనను ఇంటి నుంచి గెంటేశాడని, దీంతో మరో దారిలేక పుట్టింటికి చేరుకున్నానని ఆ ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొన్నారు. సినిమాలు, టీవీ సీరియళ్ల ద్వారా పృథ్వీరాజ్ నెలకు రూ. 30 లక్షలు సంపాదిస్తున్నారని, ఆయన నుంచి తనకు నెలకు రూ. 8 లక్షల భరణం ఇప్పించాలని కోరారు. కేసును విచారించిన విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు (కుటుంబ న్యాయస్థానం) న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని.. శ్రీలక్ష్మికి అనుకూలంగా తీర్పు చెప్పారు. ప్రతి నెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ. 8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. అంతేకాదు, ఆమె కేసు దాఖలు చేసినప్పటి నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com