వంగర మండలంలోని మడ్డువలస ప్రాజెక్టు లో ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగింది. ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో గురువారం అధికారులు మూడు ప్రధాన గేట్లు ఎత్తి 15200 క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడిచిపెడుతూ ఉన్నట్లు ప్రాజెక్టు ఏ. ఈ నితిన్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో నీటిమట్టం గురువారం నాటికి 63. 66 మీటర్లు చేరినట్లు చెప్పారు. ఎడమ కాల్వ ద్వారా 510 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నట్లు తెలియజేశారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా 9, 500 క్యూసెక్కుల నీరు స్వర్ణముఖి నదుల నుంచి వచ్చి ప్రాజెక్టు లో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో మరికొన్ని ప్రధాన గేట్లు ఎత్తి నీరు విడుదల చేయడం జరుగుతుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల గ్రామాలను భూములను ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తహశీల్దార్ డి. ఐజాక్ తెలిపారు.