పేదలకు ఇళ్ల స్థలాల కోసం నగర శివారు ప్రాంతాల్లో 72 లేఅవుట్‌లు అభివృద్ధి చేసినందుకుగాను వీఎంఆర్‌డీఎకు 450 ఎకరాలు ఇవ్వనున్నట్టు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున తెలిపారు. సోమవారం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ నగరంలో ఇళ్లు లేని పేదల కోసం సుమారు ఆరు వేల ఎకరాలు సమీకరణకు ప్రతిపాదించగా, ఇప్పటి వరకు ఐదు వేల ఎకరాలు తీసుకుని 72 లేఅవుట్‌లు అభివృద్ధి చేశామన్నారు. ఆ 72 లేఅవుట్‌లలో 1. 85 లక్షల ప్లాట్లు అందుబాటులోకి వస్తాయని అంచనా వేసినా చివరకు 1. 45 లక్షల ప్లాట్లు అనువుగా వున్నట్టు గుర్తించామన్నారు. పలు లేఅవుట్‌లలో వాగులు, కొండవాలు ప్రాంతాలు, గెడ్డల్లో వేసిన ప్లాట్లను రద్దు చేశామన్నారు. ఇప్పటివరకు అర్హులైన పేదలకు సుమారు 1. 4 లక్షల ప్లాట్లు పంపిణీ చేయగా, మరో నాలుగు వేల వరకు మిగిలాయన్నారు. వాటిని భవిష్యత్తులో అర్హులైన అందజేస్తామని వివరించారు.
ఆ 72 లేఅవుట్‌లలో మౌలిక వసతుల కోసం సుమారు రూ. రెండు వేల కోట్లు అవసరమవుతాయన్నారు. ఇంత భారీస్థాయిలో నిధుల సమకూర్చనున్న వీఎంఆర్‌డీఎకు రావలసిన 15 శాతం వాటాకు అవసరమైన భూములు లేవన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా నగర శివారు ప్రాంతాల్లో 450 ఎకరాలను సంస్థకు ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. భీమిలి మండలం అన్నవరంలో గతంలో కేటాయించిన 50 ఎకరాలతోపాటు మరోచోట 100 ఎకరాలు, పెదగంట్యాడలో 100 ఎకరాలు, ఇంకా మరికొన్నిచోట్ల ప్రభుత్వ భూములు గుర్తించామన్నారు. ఇదిలావుండగా భూములు ఇచ్చిన రైతుల కోసం రూపొందించిన లేఅవుట్లలో మౌలిక వసతుల కల్పనకు రూ. 200 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. నిధులు విడుదలైన వెంటనే పనులు చేపడతామని కలెక్టర్ పేర్కొన్నారు.