ఎన్నో ఏళ్లుగా ఆర్థికంగా వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో పరిపాలనా రాజధాని పెట్టడం ఎంతైనా అవసరమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం ఆరిలోవ ప్రాంతం శ్రీకాంత్‌నగర్‌లోని ఓ ప్రయివేటు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొని మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు పార్టీలకతీతంగా ప్రజలందరూ సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఈ ప్రాంతంలో పరిపాలనా రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుందన్న దీర్ఘకాలిక దృష్టితో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు.
అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. దీనిపై న్యాయమూర్తులు, విద్యావేత్తలు, మేధావులు ఆలోచించాలని కోరారు. దేశంలో గుజరాత్‌తో పాటు మరి కొన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులు ఉన్నాయని చెప్పారు. మన రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకించడం మంచిది కాదన్నారు. ఉత్తరాంధ్ర పౌరుడిగా విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటును బలంగా కోరుకుంటున్నానన్నారు. ఎంత మంది అడ్డంకులు సృష్టించినా విశాఖకు పరిపాలనా రాజధాని రాకుండా ఆగేది లేదన్నారు. అభివృద్ధి చెందుతున్న ఆరిలోవ ప్రాంతంలో పెద్ద హోటల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన పప్పల సత్యనారాయణను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిహెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్, విఎంఆర్‌డిఎ చైర్మన్ అక్కరమాని విజయనిర్మల, కార్పొరేటర్ అక్కరమాని రోహిణి, మాజీ మార్కెటింగ్ చైర్మన్ అల్లంపల్లి రాజబాబు పాల్గొన్నారు.