హిందూపురంలో వైసీపీ రెబల్ నేత రామకృష్ణారెడ్డి హత్య వైసీపీలో కలకలంరేపుతోంది. తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం చౌళూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి నిరసన సెగ తగిలింది. ఇటీవల హత్యకు గురైన హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇవాళ ఉదయం మంత్రి పెద్దిరెడ్డి చౌళూరుకు వెళ్లారు. అక్కడ పెద్దిరెడ్డి వాహనాన్ని రామకృష్ణారెడ్డి అనుచరులు అడ్డగించి నిరసనకు దిగారు. ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రామకృష్ణా రెడ్డికి ప్రాణహాని ఉందంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ పట్టించుకోలేదని ఆయన అనుచరులు ఆరోపించారు.
వైఎస్సార్సీపీ నేత చౌళూరు రామకృష్ణారెడ్డి (46)ని గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో రెండు రోజుల క్రితం దారుణ హత్యకు గురయ్యారు. కారం పొడి చల్లి, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి స్వగ్రామం కర్ణాటక సరిహద్దుల్లోని చౌళూరు సమీపంలో దాబా నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి దాబాను మూసివేసి, కారులో ఇంటికి వచ్చారు. కారులో నుంచి దిగుతుండగా అప్పటికే మాటువేసిన దుండగులు ఆయనపై కారం పొడి చల్లి వేట కొడవళ్లతో దాడిచేశారు. ఏకంగా 18 చోట్ల దారుణంగా నరికారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణారెడ్డిని చికిత్స కోసం స్థానికులు హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ హత్యకు వర్గపోరే కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఇక్బాల్, ఆయన పీఏ గోపీకృష్ణ, చౌళూరు రవికుమార్, హిందూపురం రూరల్ సీఐలే తన కుమారుడి హత్యకు కారణమని రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ ఆరోపించారు. పీఏ గోపీకృష్ణపై ఇటీవల ఆయన పలు ఆరోపణలు చేయడం, రూరల్ సీఐ జీటీ నాయుడుపై జాతీయ బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు, ఆగస్టు 15న గ్రామంలో జెండా ఎగరేసే విషయంలో ఎమ్మెల్సీ వర్గీయులకు, రామకృష్ణారెడ్డికి మధ్య వివాదం తలెత్తడంతో ఆయన్ను హత్యచేస్తామని కొందరు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హత్య చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
దాడి జరిగిన తరువాత సుమారు పావుగంట ఆయన రక్తపుమడుగులో పడి ఉన్నారు. ఆస్పత్రికి తరలించేవారు లేకుండా పోయారు. 15 నిమిషాల తరువాత అక్కడికి చేరుకున్న రామకృష్ణారెడ్డి చిన్నాన్న కుమారుడు లోకేష్.. కారులో ఆయనను హిందూపురం ఆస్పత్రికి తరలించారు. మొదట్లో ఎమ్మెల్సీ వర్గంలో ఉన్న ఆయన.. ఇటీవల విభేదించి.. వ్యతిరేకవర్గంలో చేరారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తరువాత హిందూపురానికి రామకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన తాత రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే.