భక్తులకు ఊరాటనిచ్చేలా ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఆంధప్రదేశ్ లోని ఆలయాల్లో దర్శన, ఇతర టికెట్ల రేట్లు పెంచే ప్రసక్తే లేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి, దేవదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఇప్పటిదాకా ఏ ఆలయంలోనూ ధరలు పెంచలేదు..పెంచే ఆలోచనాలేదన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో అభిషేకం టికెట్ ధరల పెంపు విషయంలో వివాదంపై మంత్రి స్పందించారు. ఆలయంలో అభిషేకం సేవా టికెట్ ధరను రూ. 750 నుంచి రూ.5 వేలకు పెంచారు. ఈవో సురేష్ బాబు దేవాదాయ శాఖ, ఆలయ పాలకమండలిని సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంతో సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలో ఇతర ఆలయాల్లోనూ టికెట్ల ధరలు పెంచుతారన్న వార్తలను మంత్రి కొట్టు ఖండించారు.
కాణిపాకం ఆలయంలో సదరు అధికారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంతో చర్యలు తీసుకున్నామని చెప్పారు. అలాగే, దేవాలయాల్లో టికెట్ల ధరల పెంపుపై ఎలాంటి ప్రజాభిప్రాయసేకరణ చేయడంలేదని సత్యనారాయణ తెలిపారు రూ.కోటి ఆదాయం ఉన్న ఆలయాల పాలక మండలి నియామకాలు ధార్మిక పరిషత్ ద్వారా మాత్రమే చేపట్టాలని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. ఇక, దుర్గగుడిలో అంతరాలయం దర్శనం కోసమే రూ.500 టికెట్ ఇస్తారన్నారు. అంతరాలయం, ప్రొటోకాల్ దర్శనాలను నియంత్రించడం కోసమే ఆ ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది నుంచే ఈ టికెట్ అమల్లో ఉందని తెలిపారు. ఇక, జగ్గయ్యపేటలోని బ్రహ్మనంద మఠంపై సమగ్ర వివరాలతో నివేదిక రూపొందించి ధార్మిక పరిషత్‌కు అందజేసేందుకు ఒక ఉప కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.