వచ్చే ఎన్నికల్లో ఎలాంటి అభ్యర్థులను ఎన్నుకోబోతున్నారో తమ పార్టీ నేతలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టంచేశారు. ఇదిలావుంటే రాష్ట్రంలో ముందే ఎన్నికలు వస్తాయి అనే ఆలోచనతోనే నేతలు పనిచెయ్యాలని ఆయన సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. మేము గెలుస్తాము అనే నమ్మకాన్ని నేతలే తనకు కల్పించాలని చంద్రబాబు అన్నారు. తమ పనితీరు ద్వారా తాము గెలిచే అభ్యర్థులు అని వారు ప్రూవ్ చేసుకోవాలని.. లేకపోతే భిన్నమైన నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు బుధవారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన పార్టీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలు, ఓటర్ వెరిఫికేషన్ వంటి అంశాలపై నివేదికల రూపకల్పనలో వెనుకబడి ఉన్న నేతలను స్పీడు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో వైసీపీ పాలనతో నష్టపోని వర్గం అంటూ లేదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు జగన్ పాలనతో విసిగిపోయారన్నారు. ఈ ప్రజా వ్యతిరేకతను పార్టీ అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. ప్రతి అంశంలో అసత్య ప్రచారాన్నే ఇప్పటికీ వైసీపీ నమ్ముకుందని.... దాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని సూచించారు. ఈ విషయంలో అలసత్వం ప్రదర్శించే నేతల లెక్కలు కూడా తన వద్ద ఉన్నాయంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
మూడు రాజధానులు అంటూ జగన్ మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విధ్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. విశాఖను మింగేసి....ఉత్తరాంధ్రను కబళిలిస్తున్న వైసీపీ మూకకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖను కొల్లగొట్టి... కంపెనీలను వెళ్లగొట్టిన వాళ్లు అక్కడి ప్రజల గురించి ఇప్పుడు మాట్లాడుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. సేవ్ ఉత్తరాంధ్ర పేరుతో ప్రజల, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు మనం నిలబడాలన్నారు. విశాఖలో వేల ఎకరాలను, వేల కోట్ల ఆస్తులను వైసీపీ గద్దలు చెరబడుతున్న వైనాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మూడు రాజధానులు సాధ్యం కాదని కోర్టులు స్పష్టంగా చెపుతున్నా... ఉత్తరాంధ్ర, రాయలసీమలలో రాజధానులు అంటూ జగన్ జనాన్ని మోసం చేస్తున్నారని అన్నారు. సాగునీటి రంగంలో ఎవరి హయాంలో ఎక్కువ మేలు జరిగిందో ఈఎన్సీ నారాయణ రెడ్డి మీడియా సమావేశం ద్వారానే స్పష్టంగా తెలిసిపోయిందని....దీనికి వైసీపీ మంత్రులు ఏం సమాధానం చెపుతారని చంద్రబాబు ప్రశ్నించారు.
ఆహా ఓటీటీ వేదికగా నటుడు, పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ 2 షో పైనా సమావేశంలో చర్చ జరిగింది. బోల్డ్ గా ఉండే బాలకృష్ణ శైలి కారణంగా ఆ షో అంత హిట్ అయ్యిందని చంద్రబాబు అన్నారు. తాను ఆ షో ఇంటర్వ్యూకి హాజరు అయ్యానని చంద్రబాబు తెలిపారు. నాడు అధికార మార్పిడి విషయంలో వాస్తవంగా జరిగింది ఏమిటి అనేది ఆ షోలో చర్చకు వచ్చిందన్నారు. దశాబ్దాలుగా తనపై బురద జల్లుతున్న అంశంలో తాను ఓపెన్ గా పలు విషయాలు చెప్పానన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోయారని...వారంతా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసేలా చూడాలని నేతలకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఇంచార్జ్ లు గట్టిగా పనిచెయ్యాలని చంద్రబాబు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa