పవన్ ఒక రాజకీయ ఉగ్రవాది అంటూ గుడివాడ అమర్‌నాధ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్రపై పవన్ కక్ష కట్టారని, మూడు రోజుల కాల్షీట్ తీసుకుని విశాఖ వచ్చారని విమర్శించారు. రెండు రోజుల పాటు విశాఖలో పొలిటికల్ షూటింగ్ పెట్టుకున్నారంటూ ఆరోపించారు. విశాఖ గర్జనను డైవర్ట్ చేసేందుకే పవన్ జనవాణి పెట్టుకున్నారని, శనివారం జరిగిన దాడి మూడు రాజధానుల ఉద్యమంపై జరిగిన దాడిగా మంత్రి అభివర్ణించారు. విశాఖపట్నం నటన నేర్పిందని, పిల్లనిచ్చిందని, పోటీ చేయడానికి ఒక సీటును ఇచ్చిందని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. పెళ్లి చేసుకున్న ప్రతిచోట రాజధాని పెట్టారా? అంటూ పవన్ కల్యాణ్ బాధ్యతారహితంగా మాట్లాడారని మంత్రి విమర్శించారు. మూడు పెళ్లిళ్ల విధానంలా జనసేన పార్టీ ఉందన్నారు. గత పదేళ్ల క్రితం డెక్కన్ క్రానికల్ ఆఫీసు మీదకు ఆవేశంతో గన్ను పట్టుకుని వెళ్లిన పవన్‌ను చూస్తే ఆయన మనస్తత్వం ఎంత క్రూరంగా ఉండో తెలుస్తోందన్నారు. గన్ లైసెన్స్ ఇస్తే డెక్కన్ క్రానికల్ యాజమాన్యాన్ని బెదిరిస్తావా? అంటూ అప్పటి విషయాన్ని గుర్తు చేశారు.
ఇదిలావుంటే పవన్‌పై జరిగిన దాడిని వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ఇది నియంత పాలనకు నిదర్శనమని ఆరోపించారు. జనసేన నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ర్యాలీకి అనుమతి కోరిన నేతలపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణమని, జగన్ నియంత పాలన ఏ స్థాయిలో ఉందో దీనిని బట్టి తెలుస్తోందన్నారు.
ఒక పార్టీ అధినేతగా ఆయన కారులో కూర్చోవాలా? లేదా బయటకు వచ్చి అభివాదం చేయలా? అనే విషయాలు కూడా పోలీసులే నిర్ణయిస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పవన్ చేపట్టాల్సిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదని, ప్రజాస్వామ్యయుతంగా చేపడుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోవడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ కుట్రలను ప్రజలు తెలుసుకోవాలని, జగన్‌కు ప్రజలే సరైన బుద్ది చెబుతారని వ్యాఖ్యానించారు.