ఇటీవల కాస్త తగ్గి సామాన్యుడికి ఊరాటనిచ్చిన వంట నూనెలు మళ్లీ మండిపోతున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. పొద్దుతిరుగుడు నూనె (సన్‌ఫ్లవర్ ఆయిల్) ధర గత పది రోజుల్లో ఏకంగా 17 రూపాయలు పెరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ బ్రాండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఈ నెల 1న లీటరు రూ. 138గా ఉంటే ప్రస్తుతం రూ.155గా ఉంది. ఈ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ నూనె గింజల ఉత్పత్తిదారుల సమాఖ్య(ఆయిల్‌ఫెడ్) పేర్కొంది. పొద్దుతిరుగుడు నూనె ధర పెరుగుదల ప్రభావం పామాయిల్ ధరపైనా పడింది.
గత రెండు నెలలుగా పామాయిల్ ధర తగ్గుతూ వస్తుండగా ఇప్పుడు లీటర్‌కు ఒక్కసారిగా రూ. 10 పెరిగింది. ఈ నెలాఖరు నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో వంటనూనెలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపిస్తూ వంటనూనెలకు కృత్రిమ కొరత తీసుకొస్తూ ధరలు పెంచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు, సన్‌ఫ్లవర్, వేరుశనగ నూనెల ధరలు పెరగడంతో పామాయిల్ అమ్మకాలు పెరిగాయి. దీంతో దీని ధర కూడా పది రూపాయల మేర పెరిగింది. మనకు పామాయిల్ ఇండోనేషియా నుంచి దిగుమతి అవుతుండడంతో దాని ధరలు కొంత అదుపులోనే ఉన్నాయని చెబుతున్నారు.