జనసేన నేతలపై అక్రమ కేసులను ఖండిస్తూ ఇప్పటికే పలువురు టీడీపీ నాయకులూ మీడియా ముఖంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. ఐతే తాజాగా జనసేన నేతలపై అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్ కు జైలు జీవితం అలవాటు కదా.. అందర్నీ జైలుకు పంపించాలని, అక్రమ కేసులు పెట్టారని విమర్శించారు. జనసేన అధినేత పట్ల విశాఖలో పోలీసులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. విశాఖ గర్జన తుస్సుమందని.. పవన్ రాకతో అది కాస్త గాల్లో కలిసిపోయిందని.. అందుకే అక్కసుతోనే ఇలా చేసినట్లు ఉన్నారని మండిపడ్డారు. పోలీసులు హుందాగా వ్యవహరించాలని... ప్రభుత్వాలు మారుతాయని విషయాన్ని కూడా ఉన్నతాధికారులు గుర్తుపెట్టుకోవాలని రామకృష్ణబాబు హితవు పలికారు.