బాలికపై అత్యాచారం కేసులో నిందితుడైన 74ఏళ్ల వృద్ధుడికి 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ విశాఖ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి కె. రామశ్రీనివాసరావు సోమవారం తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో నెల అదనంగా సాధారణ జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. బాధితురాలికి రూ. 4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం. ఆరిలోవ ప్రాంతానికి చెందిన బాలిక (9) మూడో తరగతి చదువుతోంది.
బాలిక తల్లి ఓ దుకాణంలో పని చేసేది. రోజూ తన కుమార్తెను స్కూలు విడిచిన తర్వాత ఆరిలోవ దుర్గాబజార్ ప్రాంతంలోని స్నేహితురాలి ఇంటి వద్ద ఉంచేది. స్నేహితురాలి బంధువు బాలయోగి(74) అక్కడే ఉండేవాడు. ఈ ఏడాది మార్చి 23న బాలికకు కడుపు నొప్పి రావడంతో తల్లి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. బాలిక ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోందని వైద్యురాలు చెప్పారు. దీనిపై కుమార్తెను తల్లి ప్రశ్నించడంతో బాలయోగి రెండుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదుపై విశాఖ దిశ పోలీసుస్టేషన్ ఏసీపీ ప్రేమ్‌కాజల్ కేసు నమోదు చేసి నిందితుడిని న్యాయస్థానంలో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితుడికి శిక్ష విధించారు.