మహిళల హక్కులు కాలరాస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా న్యాయమూర్తి బి. హెచ్. వి లక్ష్మీకుమారి హెచ్చరించారు. గంట్యాడ గ్రామ సచివాలయంలో బుధవారం సాయంత్రం జరిగిన న్యాయ అవగాహనసదస్సులో న్యాయమూర్తి లక్ష్మీకుమారి ప్రసంగించారు. సమాజంలో స్త్రీపురుషులు సమానమేనని అనాదిగా మహిళ చులకన భావానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పరిరక్షణ కోసం బలమైన చట్టాలు ఉన్నాయని తెలిపారు. వరకట్నం, లైంగిక వేధింపులు, గృహహింస కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే సంబంధిత వ్యక్తులు వ్యవస్థలో న్యాయస్థానంలో శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ డి ప్రసన్న రాఘవ, న్యాయ అవగాహన సదస్సు కన్వీనర్లు, గ్రామ ఉపసర్పంచ్ ఎం. కృష్ణబాబు సచివాలయ కార్యదర్శి వర్మ తదితరులు పాల్గొన్నారు.