గత కొంత కాలంగా టీడీపీతో పొత్తుకు విముఖత చూపుతున్న బీజేపీ నాయకత్వం జనసేన పార్టీతో కలసినడిచేందుకే మొగ్గు చూపుతోంది. ఇదిలావుంటే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల భేటీతో బీజేపీ ఉలిక్కిపడింది. బీజేపీతో కలిసి ముందుకు సాగలేమంటూ పవన్ కల్యాణ్ పరోక్షంగా స్పష్టం చేయడంతో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు. అధిష్ఠానం పిలుపు మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారు. తాజాగా బీజేపీ ఏపీ కో-కన్వీనర్ సునీల్ దేవధర్ మీడియాతో మాట్లాడుతూ... జనసేనతో బీజేపీ పొత్తు ఇకపై కూడా కొనసాగుతుందని చెప్పారు. భవిష్యత్తులో కూడా టీడీపీతో బీజేపీకి పొత్తు ఉండదని అన్నారు. టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలేనని చెప్పారు. కన్నా లక్ష్మీనారాయణ చేసిన కామెంట్లపై సోము వీర్రాజు స్పందించారని... ఈ విషయంలో అంతకు మించి తాను మాట్లాడేది ఏమీ లేదని అన్నారు. జనసేనతో రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని చెప్పారు. విశాఖలో జరిగిన ఘటనపై పవన్ కల్యాణ్ తో చాలా మంది బీజేపీ నేతలు మాట్లాడారని, సంఘీభావాన్ని తెలిపారని అన్నారు.