ఇప్పటికైనా ప్రజలను కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ తాజాగా సుప్రీం కోర్టు ఓ పిటిషన్ విషయంలో స్పందించింది. ఇదిలావుంటే దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదంటూ బుధవారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను అత్యవసరమైనదిగా భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పైనా, ఢిల్లీలో బాణసంచా నిషేధంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలను కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.