ఆరోగ్య రంగానికి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పునాది వేశారని, ఆయన తనయుడు సీఎం జగన్ ఆ రంగాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని అన్నారు. చంద్రబాబు మాత్రం ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 20 చొప్పున 108, 104 వాహనాలను ఏపీఐఐసి బిల్డింగ్ వద్ద వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల్ని మరింత మెరుగు చేసేందుకు రెండు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 104, 108 వాహనాల ద్వారా 25 వేల మందికి ఉచిత వైద్య సేవలు, ఆరోగ్య పరీక్షలు, మందులు అందిస్తామని వెల్లడించారు.