సముద్ర తీరంలో ఆనందంగా గడపడానికి వచ్చిన నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు అనంత లోకాలకు యేగారు. దీంతో వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుంటూరు సమీపంలోని బుడంపాడు లోని జీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఏడుగురు గురువారం వేటపాలెం మండలం రామాపురం బీచ్ కు వచ్చి సముద్ర స్నానం చేస్తుండగా నలుగురు గల్లంతవడం తెలిసిందే.
గల్లంతయిన విద్యార్థులను తెనాలికి చెందిన యడవల్లి రమణ, గుంటూరు, అమరావతి కి చెందిన తాళ్లూరి రోహిత్ , హైదరాబాద్ కు చెందిన తిరుమలగిరి మహదేవ్, తెనాలికి చెందిన పులివర్తి గౌతమ్ లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో మహదేవ్ మృతదేహం ఒక్కటి మాత్రమే గురువారం సాయంత్రానికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది.
మిగిలిన మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో సముద్ర తీరంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. చీరాల డీఎస్పీ శ్రీకాంత్, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.