ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీల్లో ఇమడలేని వారు బయటపడటం సహజం. ఈ నేపథ్యంలోనే తాను అధికార వైసీపీ అని చెప్పుకోడానికే సిగ్గుపడుతున్నానని కర్నూలు జిల్లా బి.తాండ్రపాడుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యుడు బోయ హనుమంతు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల సమావేశాన్ని ఆయన బాయ్‌కాట్ చేశారు. పార్టీలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు విలువ లేదన్నారు. ఎంపీపీ ఎన్నిక సమయం లో ఎన్నో హామీలిచ్చి, రెండేళ్లు కావస్తున్నా రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఎన్నికల్లో రూ.లక్షలు ఖర్చు పెట్టి గెలిస్తే కనీసం గ్రామంలో అధికార పార్టీ నాయకుడిగా ఒక్క రూపాయి పని చేయలేకపోయామని వాపోయారు. అలాంటప్పుడు ఈ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు.