రాహుల్ గాంధీ పాదయాత్రతో రాష్ట్రానికి రాహుకాలం పోయి అమృత ఘడియలు వచ్చాయని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర బ్రహ్మడంగా విజయవంతమైందని తెలిపారు. రాయదుర్గం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఐదురోజుల పాటు పాదయాత్ర సాగిందన్నారు. పాదయాత్రకు ప్రజా స్పందన అపూర్వం, అద్భుతం, అనూహ్యమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారని తెలిపారు. ప్రజలు కేంద్రంలో, రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టమైందన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రజల ఆకాంక్ష వ్యక్తమైందని అన్నారు. రాష్ట్ర రాజధాని గా రాష్ట్ర నడిబొడ్డున ఉన్న అమరావతిలోనే కొనసాగిస్తామని, అభివృద్ధి కార్యక్రమాలను అన్ని ప్రాంతాల్లో అమలు చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు పునఃవైభవం వచ్చినట్లే అని తులసిరెడ్డి పేర్కొన్నారు.