విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి నగరంలో వివిధ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులను ఆహ్వానించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సచివాలయాల్లో ఉద్యోగులను ఆయా స్టేషన్ సిబ్బంది స్టేడియానికి తీసుకొచ్చారు. లోపల ఏర్పాటు చేసిన గ్యాలరీలో మొదటి వరుసను మీడియాకు, తర్వాత సీట్లను మహిళా పోలీసులకు కేటాయించారు. వారిని లోపలకు అనుమతించారు. గ్యాలరీలో సీట్లు నిండిపోవడంతో స్టేడియం లోపలకు వచ్చిన ఉద్యోగులను భద్రతా సిబ్బంది ఆపేశారు. చాలాసేపు వారంతా టెన్నిస్ కోర్టు వద్ద నిలబడిపోయారు. అక్కడా జనం పెరిగిపోవడంతో పోలీసులే వారిని బయటకు పంపేశారు. కార్యక్రమం పూర్తయ్యే వరకు రహదారులపైనే ఉండాల్సి రావడంతో వారంతా అసంతృప్తి వ్యక్తం చేశారు.