53 ఏళ్ల క్రితం ప్రస్తుత బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం భీమవరం మాలలకు అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన ఒంగోలు మండలం దేవరంపాడు భూముల్ని అగ్రకుల ఆక్రమణదారుల చెర నుండి విడిపించి బాధిత దళితులకు అప్పగించే ప్రక్రియ మొదలైంది. శనివారం బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం భీమవరం మాలపల్లెలో ఒంగోలు ఎమ్మార్వో మురళి 145 మంది బాధిత దళిత రైతులతో శనివారం సమావేశం అయ్యారు. బాధిత రైతుల నుండి వివరాలను సేకరించారు.
బాధితుల పక్షాన పోరాడుతున్న దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు కథనం ప్రకారం 1969 లో ప్రస్తుత బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం భీమవరం గ్రామానికి చెందిన మాల కులస్తులు గ్రామ సర్పంచ్ రేవెళ్ళ సుబ్బరాయుడు, రేవెళ్ళ అంజయ్యలను అగ్రవర్ణాలు హత్య చేశారు. ఈ దాడిలో 143 మంది మాలలు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం 145 మంది బాధిత మాలలకు 1 మనిషికి 2 ఎకరాలు చొప్పున, ఒంగోలు మండలం దేవరంపాడు గ్రామంలో 290 ఎకరాల భూమిని మంజూరు చేసిందన్నారు.
2దశాబ్దాల పాటు మాల రైతులు ఈ భూమిని సాగు చేశారు. దేవరంపాడు భూములు బలవర్ధకమైనవి కాకపోవడం, తమ ఊరు భీమవరానికి, భూములున్న ఊరు దేవరంపాడుకి ప్రయాణ దూరం సగం రోజు అవుతుండడంతో, వీరి రాకలు రాకపోకలు తగ్గాయన్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని స్థానిక రైతులతో పాటు, అగ్రకుల రాజకీయ పార్టీ నాయకులు ఈ భూములపై కన్నేసి కబ్జా చేశారని వారు తహసీల్దార్ దృష్టికి తెచ్చారు. వివరాలు నమోదు చేసుకున్న తహసీల్దార్ తప్పనిసరిగా తాను న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారు.