ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. గత కొన్నేళ్లుగా సాఫ్ట్‌వేర్ సేవల్లో రారాజులుగా వెలిగిన కంపెనీలు ఇప్పుడు ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కేవలం ఈ ఒక్క నెలలోనే ఏకంగా 21% నష్టపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ఏఐ వల్ల భవిష్యత్తులో ఐటీ కంపెనీల ప్రాధాన్యత తగ్గుతుందనే భయాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి, దీనివల్ల కంపెనీల షేర్ల విలువలు భారీగా పతనమయ్యాయి.
ప్రముఖ ఐటీ సంస్థలైన కోఫోర్జ్ (Coforge), ఎల్టీఐ మైండ్‌ట్రీ (LTI Mindtree) వరుసగా 26%, 24% మేర క్షీణించి గరిష్ట నష్టాలను చవిచూశాయి. దేశీయ ఐటీ దిగ్గజాలు టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys) కూడా ఈ ప్రభావం నుండి తప్పించుకోలేకపోయాయి. ఈ దిగ్గజ సంస్థల మార్కెట్ విలువ 17% నుండి 22% వరకు పడిపోవడం గమనార్హం. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే దాదాపు ₹4.8 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద గాలిలో కలిసిపోవడం ఐటీ రంగ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలుస్తోంది.
ఈ భారీ పతనానికి ప్రధాన కారణం ఏఐ సాంకేతికతతో కోడింగ్ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయన్న అంచనాలే. గతంలో వందలాది మంది డెవలపర్లు చేసే పనిని ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ సమయంలో పూర్తి చేస్తున్నాయి. దీనివల్ల భారతీయ ఐటీ కంపెనీలు పొందే సంప్రదాయ కాంట్రాక్టులు రద్దయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. క్లయింట్లు తమ పనులను ఏఐ ద్వారా స్వయంగా చేసుకోవడం లేదా తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపడం కంపెనీల ఆదాయ వనరులపై దెబ్బకొడుతోంది.
భారత ఐటీ రంగం ప్రస్తుతం ఒక కీలక మలుపులో ఉంది. కేవలం పాత పద్ధతుల్లో కోడింగ్ సేవలు అందించడం వల్ల ఇకపై మనుగడ కష్టమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కంపెనీలు తమ వ్యాపార నమూనాలను ఏఐకి అనుగుణంగా మార్చుకోకపోతే మరిన్ని నష్టాలు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఏఐ అనేది ఒక అవకాశమా లేక ముప్పుా అనే చర్చ జరుగుతున్న తరుణంలో, ఈ భారీ మార్కెట్ పతనం ఐటీ రంగ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa