మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ వాతావరణం మునుపెన్నడూ లేనంతగా వేడెక్కుతోంది. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా తన అత్యాధునిక యుద్ధనౌకలను ఇప్పటికే ఆ దేశ తీర ప్రాంతాలకు సమీపంలో మోహరించడంతో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అమెరికా వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్న ఇరాన్, తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే పనిలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో అగ్రరాజ్యం దూకుడుకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఇరాన్ అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో చైనా నుంచి శక్తివంతమైన 'సూపర్ సోనిక్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్స్'ను కొనుగోలు చేసేందుకు ఇరాన్ సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య ఈ భారీ రక్షణ ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికా నౌకాదళం నుంచి ఎదురయ్యే ముప్పును తిప్పికొట్టడానికి ఈ క్షిపణులు ఇరాన్‌కు ప్రధాన ఆయుధంగా మారనున్నాయి. చైనాతో కుదుర్చుకుంటున్న ఈ డీల్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
ఈ సూపర్ సోనిక్ క్షిపణులు అత్యంత వేగంతో ప్రయాణిస్తూ సుమారు 290 కిలోమీటర్ల దూరంలోని శత్రువుల లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు. వీటి వేగం మరియు అధునాతన సాంకేతికత కారణంగా, సాధారణ రక్షణ వ్యవస్థలు లేదా రాడార్లు వీటిని గుర్తించి అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సముద్ర గర్భంలో మోహరించిన యుద్ధనౌకలను ఇవి క్షణాల్లో తుత్తునియలు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో అమెరికా దళాల్లో ఆందోళన మొదలైంది.
పశ్చిమాసియాలో ఆధిపత్యం కోసం సాగుతున్న ఈ పోరులో, ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం వ్యూహాత్మక మార్పులకు దారితీయనుంది. చైనా క్షిపణుల రాకతో ఇరాన్ తీర ప్రాంతం ఒక ఇనుప కోటలా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలు కేవలం రెండు దేశాలకే పరిమితం కాకుండా, గల్ఫ్ రీజియన్‌లో శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ అగ్రరాజ్యాల పంతం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa