మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ నిర్బంధం కేసులో పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారని జిల్లా ఎస్. పి అన్బురాజన్ తెలిపారు. బాధిత మహిళ భర్త చడమల సుబ్బరాయుడు 20 న సాయంత్రం మైదుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారని, దీనిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసు తీవ్రత దృష్ట్యా మైదుకూరు డి. ఎస్. పి ని విచారణాధికారిగా నియమించడం జరిగిందని జిల్లా ఎస్. పి తెలిపారు. కేవలం 24 గంటల్లో ముద్దాయి సుధాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎస్. పి వివరించారు.
వాస్తవాలు ఇలా ఉండగా, కొందరు వ్యక్తులు పోలీసులు ఇంకా చర్యలు తీసుకోలేదని, ముద్దాయిని అరెస్టు చేయలేదని అసత్యాలు, అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదోవ పట్టిస్తున్నారని ఎస్. పి తెలిపారు. పోలీసులపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రవర్తించడం సరికాదని జిల్లా ఎస్. పి హితవు పలికారు. అవాస్తవాలు, అసత్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్. పి హెచ్చరించారు.