ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన కేసులో ట్రైల్ రన్ కూడా చేయలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారని తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విమర్శించారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర విషయంలో ప్రభుత్వ తీరుతో పోలీసులు నవ్వుల పాలవుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నికుమారి లక్ష్మి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో అశోక్ గజపతి రాజు, జిల్లా నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మిత్ర పక్షాలకు మద్దతుగా నిలిచామని.. ఇప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ తరపున చిన్నికుమారి లక్ష్మిని బరిలో నిలిపామని వెల్లడించారు. ఓటర్లందరూ టీడీపీకి మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.
అమరావతి రైతుల పాదయాత్రపై అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. రైతులు చేస్తున్న పాదయాత్రను అడ్డుకొని ఐడీ కార్డులు అడుగుతున్నారని.. ప్రభుత్వ వ్యవహారంతో పోలీసులు నవ్వులు పాలవుతున్నారని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. స్వతంత్ర భారత దేశంలో ప్రజలకు స్వతంత్ర భావాలు లేకుండా చేయడానికి ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ భయపెడుతున్నారని తెలిపారు. ఏపీలో రాజ్యాంగం అమలు కావడం లేదని రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులే అంటున్నారని అశోక్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి ఎన్నో మొట్టి కాయలు వేసిందని అశోక్ గజపతిరాజు అన్నారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి మార్పు లేదన్నారు.