ఆంధ్రప్రదేశ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న పోలీసు జీపు.. ఎదురుగా వస్తున్న బైక్ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. కాన్వాయ్ పక్కకు ఆపించి, ఘటనా స్థలిని పరిశీలించారు. పెద్దపంజాణి మండల కేంద్రంలో మదనపల్లి - పలమనేరు జాతీయ రహదారిపై శనివారం (అక్టోబర్ 22) మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్ వెనకాల టమోటో లోడ్‌తో వస్తున్న మరో వాహనం బోల్తా పడింది. ఆ వాహనంలోని డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీస్ వాహనంలోని డ్రైవర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. కాన్వాయ్‌లో వెనుక వాహనంలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాహనానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ప్రమాదం నుంచి ఆయన బయటపడ్డారు.