కిళ్లీ బావా, బామర్థుల ప్రాణాలు తీసింది. అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలం గుండావారిపల్లిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం తిన్న తర్వాత కిళ్లీ వేసుకున్న బావ, బావమరిది అకస్మాత్తుగా మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. భోజనం చేసిన తర్వాత తాంబూలం తిన్న బావ, బావమరులు కృష్ణమూర్తి, కనకరాజు ఒక్కసారిగా వాంతులు చేసుకున్నారు. బావ కృష్ణమూర్తి కొద్దిసేపటికే మృతి చెందగా.. గ్రామానికి చేరుకోగానే బావమరిది కనకరాజు ప్రాణాలు కోల్పోయాడు.
దీంతో ఇద్దరి మరణాలు మిస్టరీగా మారాయి. కిళ్లీ వేసుకున్న తర్వాత ఇద్దరు వ్యక్తులు చనిపోవడం గ్రామంలో హాట్‌టాపిక్‌గా మారింది. తాంబూలం వేసుకున్నందుకే చనిపోయారా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.