పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేస్తూ దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచన ప్రస్తుతం లేదని స్పష్టం చేసింది. అంతర్‌మంత్రిత్వ సమీక్ష సమావేశంలో శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు చేయాలనే నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రజలు అనవసర భయాలకు లోనుకాకుండా ఉండాలని సూచిస్తూ, దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎల్పీజీ, పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్ తగిన మోతాదులో అందుబాటులో ఉండటంతో సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని వెల్లడించారు.పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ముడి చమురు, ఎల్పీజీ, పీఎన్‌జీ దిగుమతులపై కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, దాని ప్రభావం సాధారణ ప్రజలపై పడకుండా చర్యలు తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. గృహ వినియోగదారులకు ఎల్పీజీ సరఫరా యథావిధిగా కొనసాగుతుండగా, పీఎన్‌జీ సరఫరా కూడా నిరంతరంగా జరుగుతోందని వెల్లడించింది. అలాగే రవాణా రంగానికి కీలకమైన సీఎన్‌జీ సరఫరా కూడా అంతరాయం లేకుండా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రజా రవాణా, ప్రైవేట్ వాహనదారులు ఇబ్బంది పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.కామర్షియల్ ఎల్పీజీ సరఫరాలో కొంత అంతరాయం వచ్చినప్పటికీ, ప్రస్తుతం దాదాపు 70 శాతం వరకు పునరుద్ధరించామని కేంద్రం తెలిపింది. ఆసుపత్రులు, విద్యాసంస్థలు, అత్యవసర సేవలకు ప్రాధాన్యత ఇస్తూ సరఫరాను కొనసాగిస్తున్నట్లు వివరించింది. ఔషధ తయారీ, ఉక్కు, విత్తన పరిశ్రమల వంటి కీలక రంగాలకు అవసరమైన ఇంధన సరఫరా అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఉత్పత్తి వ్యవస్థలు దెబ్బతినకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.ఇటీవలి రోజుల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.25 నుంచి రూ.28 వరకు పెంచవచ్చన్న వార్తలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం వాటిని ఖండించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టతనిచ్చింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సరఫరా పరిస్థితిపై మంత్రి నాదెండ్ల మనోహర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ఇంధన మళ్లింపులకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్ విధానం అమలు వల్ల రాష్ట్రవ్యాప్తంగా డ్రై-అవుట్ ఘటనలు తగ్గుముఖం పట్టాయని ఆయన తెలిపారు. పరిస్థితి పూర్తిగా సాధారణ స్థితికి చేరేవరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఇక హైదరాబాద్‌లో వరుసగా రెండో రోజూ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగింది. ఇంధన కొరత వస్తుందనే భయంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బంకులకు చేరుకోవడంతో లక్డీకాపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, టోలిచౌకి ప్రాంతాల్లో భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ కూడా తీవ్రంగా దెబ్బతిని, పీక్ అవర్స్ సమయంలో వాహన రాకపోకలు మందగించాయి. మొత్తం మీద ఇంధన సరఫరా సాధారణంగానే కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసినందున ప్రజలు పుకార్లను నమ్మకుండా అవసరానికి తగ్గట్టే ఇంధనం వినియోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa