ఇటీవల చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్ పర్యటించిన అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ నివాసంలోకి ఓ ఆగంతుకుడు ప్రవేశించి ఆమె భర్తపై దాడి చేశాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ ఇంట్లో లేరు. ఇంట్లోకి చొరబడిన దుండగుడు నాన్సీ భర్త పాల్ పెలోసీపై దాడి చేశాడు. ఈ దాడిలో 82 ఏళ్ల పాల్ పెలోసీ గాయపడ్డారు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పాల్ పెలోసీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఓ క్యాపిటల్ వెంచర్ సంస్థ నిర్వహిస్తున్నారు. అయితే, ఆయనపై దాడికి గల కారణాలు ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. కాగా, ఆ దుండగుడు ఓ సుత్తితో దాడికి పాల్పడినట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఇంట్లోకి చొరబడిన అనంతరం అతడు నాన్సీ పెలోసీ కోసం వెదికినట్టు తెలుస్తోంది. నాన్సీ ఎక్కడ? నాన్సీ ఎక్కడ? అంటూ కేకలు వేసినట్టు ఇంట్లోని పనివారిని ఉటంకిస్తూ పాశ్చాత్య మీడియా ఓ కథనంలో పేర్కొంది. ఇటీవల నాన్సీ పెలోసీ చైనా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ తైవాన్ పర్యటించారు. ఆమె పర్యటన అనంతరం తైవాన్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్ కు దన్నుగా అమెరికా తన విమాన వాహక నౌకలను పంపడం తెలిసిందే.