పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవికి దూరమయ్యాక పాలకులపై విమర్శలు తీవ్ర తీరం చేస్తున్నారు. తాజాగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాను ఐఎస్‌ఐ బండారం బట్టబయలు చేయగలనని, కానీ దేశ అభివృద్ధి కోసం ఆగిపోతున్నానని చెప్పారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడైన ఇమ్రాన్ ఖాన్ లాహోర్ లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ నదీమ్ అంజుమ్‌పై హెచ్చరికలు చేశారు. తాను చెప్పే విషయాలను నదీమ్ చెవులు రిక్కించుకుని వినాలన్నారు. ఐఎస్ఐ గురించి తనకు చాలా విషయాలు తెలుసని, కానీ నా దేశానికి హాని చేయకూడదనుకోవడం వల్లనే మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసం నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నానని ఇమ్రాన్ స్పష్టం చేశారు.
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఆ సమయంలో తన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిఫలంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాకు ఇమ్రాన్ లాభదాయకమైన ఆఫర్ ఇచ్చారని నదీమ్ అహ్మద్ గురువారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ఈ ఆరోపణలను ఇమ్రాన్ ఖండించారు. ప్రభుత్వంలోని దొంగలకు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకుండా ఆయన కేవలం తననే టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. దేశానికి విముక్తి కలిగించి, పాకిస్థాన్‌ను స్వేచ్ఛా దేశంగా మార్చడమే తన ఏకైక లక్ష్యం అని అన్నారు.