నిస్వార్ధంగా స్వచ్ఛత కోసం, సమాజం కోసం కృషి చేస్తున్న నేటి గాంధీ డాక్టర్ డీఆర్కే.ప్రసాద్ అని సన్షైన్ హాస్పటల్ అధినేత డాక్టర్ ఎ.వి.గురవారెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ చల్లపల్లి ఎనిమిదో వార్షికోత్సవం శనివారం సాయంత్రం చల్లపల్లిలో ఘనంగా జరిగింది. పద్మాభిరామంలో జరిగిన సభలో గురవారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ డీఆర్కే.ప్రసాద్, డాక్టర్ పద్మావతి చల్లపల్లిలో వైద్యులుగా ప్రాక్టీసు చేయ టం ఇక్కడ ప్రజల అదృష్టమన్నారు. స్వచ్ఛ చల్లపల్లి సాంఘిక ప్రయోగమనీ, ప్రజల్లో మార్పు, స్ఫూర్తివస్తేనే విజయవంతం అవుతుందన్నారు. డీఆర్కే దంపతుల బాటలో నడిచే స్వచ్ఛ కార్యకర్తలు లభించటం వారి అదృష్టమన్నారు. స్వ చ్ఛ చల్లపల్లికి తానూ ఉడతాభక్తిగా చేయూత అందించటం గర్వంగా భావిస్తానని తెలిపారు. సభాధ్యక్షత వహించిన స్వచ్ఛ చల్లపల్లి సారధి డాక్టర్ డీఆర్కే.ప్రసాద్ మాట్లాడుతూ, స్వచ్ఛ కార్యకర్తల వెలకట్టలేని శ్రమ ఎంతో ఉత్సాహాన్ని, స్పూర్తిని ఇస్తుందన్నారు. స్వచ్ఛ చల్లపల్లి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందనీ, గురవారెడ్డి ఇచ్చే ప్రోత్సాహం అభినందనీయమని తెలిపారు.