కృష్ణా మిల్క్ యూనియన్ (విజయా డెయిరీ) నవంబరు 1 నుంచి విజయ గోల్డ్ లీటరకు రూ.2 పెంపుదల చేసింది. పాలసేకరణ ధర, డీజిల్ తద్వారా రవాణా ఖర్చులు, ప్యా కింగ్ మెటీరియల్, ఇతర వ్యయాలు పెరిగినందున అనివార్య పరిస్ధితుల్లో పెంచినట్టు కృష్ణా మిల్క్ యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అన్ని యూనియన్లు రేట్లను పెంచడంతో తాము కూడా పేద మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా కేవలం రెండు కేటగిరిల్లోనే పాల ధరలను స్వల్పంగా పెంచామన్నారు. విజయ స్పెషల్ (ఎంఎం) ఎక్కువ బేకరీలు వ్యాపార సంస్థలు, వినియోగిస్తాయని పెంపు ప్రభావం వినియోగదారులపై ఉండదన్నారు. విజయ గోల్డ్ లీటరు రూ.70 ఉండగా 72గా, విజయ స్పెషల్ (ఎంఎం) లీటరు రూ.68 ఉండగా రూ.70 పెంచినట్లు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి వినియోగదారులు ఉపయోగించే లోప్యాట్ (డీటీఎం), ఎకానమీ (టీఎం), ప్రీమియం (ఎస్‌టీడీ) పాల ధరల్లో ఎటువంటి మార్పు లేదన్నారు. జాతీయంగా పాలు, పాల పదార్థాలకు సంబంధించిన ముడిసరకులకు ఇతర దేశాల నుంచి ఎక్కువ డిమాండ్ ఉండటంతో మన దేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్న పాలు, పాల పదార్థాల ముడి సరకుల ధరలు పెరిగాయని, దీంతో గోల్డ్, స్పెషల్ (ఎంఎం) ధరలు పెంచక తప్పలేదని వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.