ఐక్య ఉద్యమాల ద్వారానే సమస్యల పరిష్కారానికి పునాదులు పడతాయని ఆంధ్రప్రదేశ్ ఆశావర్కర్ల యూనియన్ నాయకురాలు ఎ.కమల పిలుపునిచ్చారు. గుడివాడ లోని ఎన్జీవో హోమ్‌లో ఏపీ ఆశావర్కర్ల యూనియన్ కృష్ణాజిల్లా 5వ మహాసభలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కమల మాట్లాడుతూ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాన్ని ఆశావర్కర్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆశావర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వాల్లో స్పందన కరువైందన్నారు. సెలవులు లేని పని దినాలతో ఆశావర్కర్లు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యలపై భవిష్యత్ ఉద్యమాలకు కలసి రావాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.