చిత్తూరు - వేలూరు జాతీయ రహదారిలో శనివారం రాత్రి ప్రమాదం చోటు చేసుకొంది. ఒక కార్ ప్రమాదానికి గురవ్వగా , అందులోని వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గుడిపాల పోలీసుల కథనం మేరకు.. పాండిచ్చేరికి చెందిన పి.మురుగేష్ భార్య ఎం.లక్ష్మీకావ్య, కుమార్తె ఎం.అష్మిత, కుమారుడు ఎం.అక్షంత్లతో కలిసి కారులో బెంగళూరుకు వెళుతున్నారు. 190 రామాపురం సీఎంసీ వద్ద గుంతల మయమైన రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడింది. మూడు పల్టీలు కొట్టి డివైడర్ను ఢీకొంది. కారు నుజ్జునుజ్జయింది. మురుగేష్ కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 190 రామాపురం సీఎంసీలో చేర్పించారు. గుడిపాల ఏఎస్ఐ చలపతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.