కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో రద్దు చేసిన ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి శనివారం స్థానిక ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ‘కుప్పం ఆర్టీసీ డిపో నుంచి వెళ్లే బస్సు సర్వీసులను చాలా వరకు తగ్గించేశారు. పలు ప్రాంతాలకు గతంలో వెళ్తున్న బస్సులను సైతం రద్దు చేశారు. కుప్పం ఆర్టీసీ డిపో దాదాపు 40 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోంది. నాలుగేళ్ల క్రితం కుప్పం ఆర్టీసీ డిపోనుంచి సుమారు 105 బస్సు సర్వీసులు నడిచేవి. ప్రస్తుతం ఈ సర్వీసుల సంఖ్య కేవలం 54కు పరిమితం చేశారు. ఇది చాలా దారుణం. కర్ణాటక, తమిళనాడు నుంచి వివిధ వర్గాల ప్రజలు నిత్యం కుప్పానికి రాకపోకలు సాగిస్తుంటారు. కుప్పం నుంచి విజయవాడ, చెన్నై, బెంగళూరు వెళ్లే బస్సు సర్వీసులను చాలా వరకు రద్దు చేశారు. ఈ సర్వీసులు లేకపోవడంవల్ల నియోజకవర్గ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కుప్పం నుంచి తిరుమలకు వెళ్లే బస్సు సర్వీసులను కూడా తగ్గించారు. చిత్తూరు వెళ్లే బస్సు సర్వీసును రద్దు చేశారు. తొలగించిన బస్సు సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలి అని కోరారు.