వైసీపీ ప్రభుత్వంపై మరింత దూకుడుగా పోరాడి 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి అమరనాథరెడ్డికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సూచించారు. పలమనేరులో అత్యధిక మెజారిటీతో గెలవడమే గాక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ గెలుపునకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అందరినీ కలుపుకొని ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాడటమే గాక నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువకావాలని సూచించారు. మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం చంద్రబాబుతో అమరనాథరెడ్డి సమావేశమై పలమనేరు నియోజకవర్గ అంశాలపై చర్చించారు. తాజా సర్వే ఆధారంగా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. పార్టీ కార్యక్రమాలను అమరనాథరెడ్డి అధినేతకు వివరించారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, అసహనం ఉందని, ప్రతి అంశంలో వారిని చైతన్య పరచడంతో పాటు వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. విజయం తథ్యమని, అలసత్వం వహించక సమష్టిగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు.