అనంతపురం వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. కొత్త పాలకవర్గ సభ్యులు ఎవరనే చర్చమొదలైంది. పొడిగింపు కోసం పాత పాలకవర్గం ప్రయత్నిస్తోంది. ఆశావహులు అవకాశం కోసం చూస్తున్నారు. తాజా మాజీ పాలకవర్గం ఏర్పడక ముందు నుంచి పదవిని ఆశించిన వారు ప్రస్తుతం పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరికి అండగా నిలుస్తారో అన్న చర్చ మొదలైంది.2020 ఫిబ్రవరిలో ఏర్పాటైన పాలకవర్గం గడువు గత నెల 23తో ముగిసింది. ఏడాది కోసారి పాలకవర్గాన్ని మార్చాల్సి ఉంది. ఈ లెక్కన 2021 ఫిబ్రవరిన కొత్త పాలకవర్గం ఏర్పడాలి. కానీ అప్పటి పాలకవర్గం ఏర్పడిన రెండు నెలలకే కొవిడ్ విపత్తు వచ్చింది. దీంతో పాలకవర్గ సభ్యుల వినతి మేరకు ఏడాది పొడిగించారు. ఈ ఏడాది ఫిబ్రవరికి పాలకవర్గం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయింది. దీంతో కొత్త పాలకవర్గం ఏర్పాడుతుందని అందరూ అనుకున్నారు. ఆశావాహులు ప్రయత్నాలు చేశారు. కానీ ప్రభుత్వం మరో ఆరునెలలు పొడిగించడంతో నిరాశ చెందారు. ప్రస్తుతం ఆ గడువు కూడా పూర్తి అయింది. దీంతో ఆశావహులు ఇప్పుడైనా అవకాశం దక్కకపోతుందా అని తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారు.