సంతనూతలపాడు,పరిధిలోని మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కరపత్రాలు దర్శనమిచ్చాయి. వైసీపీ తరపున పోటీచేస్తున్న అభ్యర్థికి సంబంధించిన ప్రచార బ్రోచర్లు అధికారుల టేబుళ్లపై ఉన్నాయి. టీడీపీ మండలాధ్యక్షుడు మద్దినేని హరిబాబుతోపాటు పలువురు డిగ్రీ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కోసం దరఖాస్తులు ఇచ్చేందుకు శనివారం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ అభ్యర్థి ప్రచార పత్రాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తీరుపై అనుమానాలు కలుగుతున్నాయని హరిబాబు ఆరోపించారు. కార్యాలయంపైనున్న జాతీయజెండా సైతం చిరిగిపోయి ఉందన్నారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ వైసీపీ వారికి కాదని మండిపడ్డారు. దీనిపై తహసీల్దార్ ఎస్.శ్రీనివాసరావును వివరణ కోరగా ఆ కరపత్రాలు కార్యాలయంలోకి ఎలా వచ్చాయో తమకు తెలియదని, వాటిని వెంటనే తీసివేయిస్తానని తెలిపారు.