విశాఖపట్నం, కేజీహెచ్ ప్రక్షాళనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున నడుంబిగించారు. గత మూడు రోజులుగా ఆకస్మిక తనిఖీలతో పాటు ఉన్నతాధికారులు, హెచ్‌వోడీలతో సమావేశాలు నిర్వహించిన ఆయన...వైద్యులు, విభాగాధిపతులు, యూనిట్ హెడ్‌లు, ప్రొఫెసర్లు, ఇతర ఉన్నతాధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించిన విధి,విధానాలతో శనివారం రాత్రి సర్క్యులర్‌ను జారీచేశారు. ఈ ఆదేశాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ఇందులో ప్రధానంగా పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే....కేజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి. వంద శాతం బయోమెట్రిక్ హాజరు ఉండాలి. యూనిట్ హెడ్, ప్రొఫెసర్లు తమ యూనిట్‌లోని వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది బయోమెట్రిక్ వేసేలా చూడాలి. ప్రభుత్వం నిర్దేశించిన సమయపాలనను పాటించాలి. ఆ సమయాల్లో ఆస్పత్రిలోనే ఉండాలి. యూనిట్ హెడ్ అనుమతి లేకుండా ఆస్పత్రి బయటకు వెళ్లకూడదు. ప్రతి యూనిట్‌లో తాగునీరు, రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా ఉండేలా చూడాలి. టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండాలి. విభాగాధిపతులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి. తనిఖీల్లో భాగంగా గుర్తించిన అంశాలను వారాంతపు నివేదికల్లో సూపరింటెండెంట్‌కు అందించాలి. నర్సింగ్ సిబ్బందిని నర్సింగ్ సూపరింటెండెంట్లు పర్యవేక్షించాలి. రోగులకు మెరుగైన సేవలు అందించేలా చూడాలి. వంద శాతం బయోమెట్రిక్ హాజరువేసేలా ఆస్పత్రి సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైన బయోమెట్రిక్ మెషీన్లు అందుబాటులో ఉంచాలి. అవి నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. బయోమెట్రిక్ హాజరు వేసే ప్రాంతం, ఆయా విభాగాలు, పనిచేసే ప్రాంతాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలి అని షరతులు విధించారు.