పులివెందుల నియోజకవర్గం , సింహాద్రిపురం మండల పరిధిలోని బలపనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప మాలతో పాఠశాలకు వెళ్లడంపై ఉపాధ్యాయుడు రాజశేఖర్‌రెడ్డి అభ్యంతరం చెప్పడం వివాదాస్పదంగా మారింది. మాల ధరించిన విద్యార్థి పాఠశాలకు వస్తే ఇక్కడ మధ్యాహ్న భోజనంలో గుడ్డు, చికెన్ వండుతుంటారని, మరి కొన్ని ఇబ్బందులు ఉంటాయని ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించాడు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు హిందూ సంఘాలను ఆశ్రయించడంతో వారు శనివారం పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. పులివెందుల సీఐ బాలమద్దిలేటి అక్కడకు చేరుకుని సమస్యపై ఆరా తీశారు. ఇరువర్గాల వారితో చర్చించి రాజీ కుదిర్చారు. ఇకపై అయ్యప్ప మాల, అయ్యప్ప దుస్తులు ధరించి పాఠశాలకు వచ్చినా ఎలాంటి అభ్యంతరాలు చెప్పమని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని పాఠశాల ప్రధానోపాద్యాయుడు సతీ్‌షకుమార్, ఉపాధ్యాయులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనుతిరిగి వెళ్లారు. కాగా.. అయ్యప్ప మాల ధరించి బలపనూరు జడ్పీ హైస్కూల్‌కు వచ్చిన విద్యార్థిని ఈ నెల 19 వతేదీన రానివ్వకుండా అడ్డుకొని ఉపాధ్యాయుడు రాజశేఖర్‌రెడ్డి బెదిరించాడని విద్యార్థి తండ్రి చేసిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేశారని పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు తెలియజేసారు.