‘సాక్షులకు పదవులిచ్చి ప్రలోభ పెడుతుంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్ష్యం ఎలా చెబుతారు? ప్రభుత్వ ఉద్యోగులైన సాక్షులకు పదోన్నతులు కల్పిస్తుండగా, సహ నిందితులకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారు. మురళీధర్ రెడ్డిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. సహనిందితుడే ముఖ్యమంత్రి అయినప్పుడు విచారణకు ఎలా అనుమతిస్తారు? ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడం సహా నిందితులకు రాజకీయంగా పదవులను ఇవ్వడం ద్వారా జగన్‌రెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారన్నారు’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. హైకోర్టులో తనకు చుక్కెదురైనట్లు జగన్ పత్రికలో రాశారని, అదే వివేకానంద రెడ్డి కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను పలుసార్లు న్యాయస్థానాలు తిరస్కరించినప్పటికీ చుక్కెదురన్న వార్త ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. జగన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై అవతలిపక్షానికి నోటీసులు ఇవ్వమని కోరగా హైకోర్టు తిరస్కరించిందన్నారు. అవతలి పక్షానికి నోటీసులు ఇవ్వకుండానే వాదనలు ముగిసినా.. కేసులో తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని అనుకునేంత అమాయకుడిని కాదన్నారు. పది రోజుల్లోనే హైకోర్టు తీర్పు వెలువరిస్తుందని భావించానని, కానీ 10 నెలల ఐదు రోజుల సమయం పట్టిందన్నారు. కోర్టు తీర్పు వెంటనే వచ్చి ఉంటే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని అన్నారు.