కేరళ రాష్ట్రంలో లాటరీ వ్యవస్థ కూడా అక్కడి ప్రజానికానికి ఓ జీవనధార రంగంగా మారింది. అంతేకాదు పేదలకు ఇదో వరంగా మారుతోంది. ఇదిలావుంటే అతడో చేపల వ్యాపారి. బ్యాంకు నుంచి తీసుకున్న రూ.9 లక్షల రుణాన్ని తీర్చలేదు. ‘తీసుకున్న అప్పు చెల్లించాలి. లేదంటే నీ ఇంటిని వేలం వేస్తాం’అంటూ బ్యాంకు నుంచి నోటీసు అందింది. దీంతో దిగాలుగా ఉండిపోయిన అతడికి.. అదే రోజు అక్షయ లాటరీలో రూ.70 లక్షలు గెలుచుకున్నట్టు వార్త అందింది. ఇది కేరళ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన. ఇలాంటి అదృష్టాలు ఏటా కేరళలో ఎన్నో వినిపిస్తుంటాయి. ఈ ఏడాది ఓనమ్ బంపర్ లాటరీ టికెట్ ధర రూ.500. ప్రైజ్ రూ.25 కోట్లు. కానీ ఈ లాటరీ టికెట్ల అమ్మకాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.270 కోట్లు.
కేరళలో లాటరీ అంటే చాలా మందికి క్రేజీ. ముఖ్యంగా సామాన్యులు, ఆటో వాలాలు ఎక్కువగా లాటరీ టికెట్లు కొంటుంటారు. అదృష్టవంతులు కొద్ది మందే అయినా.. తమ జీవితంలో ఏదో ఒక రోజు అదృష్టం తలుపు తట్టబోదా? అన్న ఆశే లాటరీ వైపు ఆకర్షిస్తోంది. ప్రభుత్వం గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహిస్తుందన్న విమర్శలు సైతం వినిపిస్తుంటాయి. కాసేపు వీటిని పక్కన పెట్టి చూస్తే.. లాటరీ రూపంలో కేరళలో ఎంతో మంది కడుపు నిండుతోందని చెప్పుకోవాలి.
లాటరీ విభాగంలో 899 మంది ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తుంటారు. టికెట్ల ప్రింటింగ్, విక్రయాలు, ప్రచారం, రవాణా, రోజువారీ వ్యవహారాలు వీరు పర్యవేక్షిస్తుంటారు. ఇక 95,896 మంది డైరెక్ట్ ఏజెంట్లు, 2.5-3 లక్షల మంది పరోక్ష ఏజెంట్లు లాటరీపై ఆధారపడి జీవిస్తున్నారు. అంటే సుమారు 4 లక్షల మందికి లాటరీ ఉపాధి కల్పిస్తోంది. సగటున ఒక్కో కుటుంబంలో ఐదుగురు చొప్పున వేసుకున్నా.. 20 లక్షల మందికి లాటరీ అన్నం పెడుతోందని గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రభుత్వం ఏజెంట్ల సంక్షేమం కోసం ఒక బోర్డ్ నిర్వహిస్తోంది. వారి వైద్య చికిత్సల వ్యయాలు, వారి పిల్లల విద్య, ఇతర అవసరాలను ఇది చూస్తుంటుంది. ఇతర పనులు చేయలేని ఎంతో మందికి లాటరీ ఉపాధి కల్పిస్తోందని కొందరు నిపుణుల వాదనగా ఉంది. అయితే, లాటరీ మోజుతో కష్టపడి సంపాదించుకున్నదంతా పోగొట్టుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారంటూ మరికొందరు ఆరోపిస్తుంటారు. ఏదైమైనా లాటరీ భారీ సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న కార్యక్రమమే అని చెప్పుకోవాలి.