టోర్నీలో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలన్న ఆత్రుతతో పసికూన నెదర్లాండ్స్ పై పాకిస్థాన్ బౌలర్లు విజృంభించారు. టీ20 వరల్డ్ కప్ సూపర్-12 మ్యాచ్ లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నా, బలమైన పాకిస్థాన్ బౌలింగ్ దళం ముందు నిలవలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఆ జట్టులో కోలిన్ అకెర్మన్ చేసిన 27 పరుగులే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 15 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. పాక్ బౌలర్లలో స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీయగా, మహ్మద్ వాసిమ్ జూనియర్ 2, షహీన్ అఫ్రిది 1, నసీమ్ షా 1, హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశారు. ఈ టోర్నీలో సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్థాన్ కు నేటి మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి. అందుకే ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టకుండా, నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేసింది. 92 పరుగుల స్వల్ప లక్ష్యమే కావడంతో పాక్ ఆడుతూ పాడుతూ నెగ్గుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.