ఓ ఎంపీ, ఢిల్లీ జల్ బోర్డ్ అధికారులకు మధ్య వివాదం మరింత ముదిరింది. కాళిందికుంజ్లోని యమునా నది ఒడ్డున బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఢిల్లీ జల్ బోర్డ్ చీఫ్ వాటర్ అనలిస్ట్ (డీజేబీ) సంజయ్ శర్మ మధ్య చిన్న గొడవ రాజుకుంది. అదికాస్తా తారాస్థాయికి చేరుకుంది. అధికారులను ఎంపీ నిలదీయగా.. అధికారులు ఆయనకు చేతలతో సమాధానం ఇచ్చారు. మీడియా ముందు యమునా నీటితో స్నానం చేసి.. మరీ నిరూపించారు.
ఎంపీ పర్వేశ్ వర్మ శుక్రవారం చత్ పూజా సన్నాహాలను పరిశీలించడానికి సైట్‌ను సందర్శించారు. ఆ టైంలో యమునా నదిలో రసాయనాలు చల్లుతున్న ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) అధికారులతో ఎంపీ వాగ్వాదానికి దిగారు. "మీరు ఇక్కడ ప్రజలను చంపుతున్నారు. మీరు ఎనిమిదేళ్లుగా నదిని శుభ్రం చేయలేకపోయారు. నదిలో మునగండి" అని అన్నారు.
అంతేకాదు ఛత్ పూజా సమయంలో నదిలోకి దిగి స్నానం చేసేవారు అనారోగ్యానికి గురైతే లేదా చనిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. "యమునా సమీపంలోని ఛత్ ఘాట్‌ని సందర్శించినప్పుడు.. అక్కడ విషపూరిత రసాయనాలతో కూడిన కంటైనర్లను చూశాను. నీళ్లలో కలిపిన కెమికల్స్ కారణంగా.. ఎవరైనా మరణించినా, అనారోగ్యం పాలైనా.. ఎవరు బాధ్యులు..?" అని ఆయన అన్నారు. సంబంధిత వీడియో వైరల్ అయింది.
ఎంపీ చేసిన విమర్శలను డీజేబీ సంజయ్ శర్మ కూడా సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు శర్మ మీడియాను పిలిచి.. అందరి ముందు స్నానం చేశారు. రసాయనాలు కలిపిన తర్వాత యమునా నీటిని డ్రమ్ముల్లో నింపి.. వాటితో ఆయన స్నానం చేశారు. రసాయనాలు కలిపిన యమునా నదిలోని నీళ్లు పూర్తి సురక్షితం అని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.