ఓ దొంగకు అతడిలోని ఆత్మ మేలుకొల్పింది. అంతే అతనిలోని మంచితనం బయటకు వచ్చింది. కొట్టేసిన నగలను, డబ్బును ఏ దొంగైనా వెనక్కి ఇచ్చేస్తాడా..? అది సాధ్యమే కాదు. దొంగతన బాధితులు పోలీసులు చుట్టూ తిరిగినా..? ఆ సొమ్ముపై మాత్రం ఆశలు వదులుకుంటారు. కానీ మధ్యప్రదేశ్‌లో దీనికి రివర్స్‌లో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ బాలాఘాట్ జిల్లాలోని ఒక ఆలయంలో ఎత్తుకెళ్లిన వెండి, ఇత్తడి, బంగారు వస్తువులను తిరిగి.. ఇచ్చేశాడు. పైగా ఓ క్షమాపణ లేఖను పెట్టాడు.
అక్టోబర్ 24న లమ్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినాథ్ దిగంబర్ జైన్ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తి కొన్ని వెండి, బంగారం, ఇత్తడి వస్తువులను దొంగిలించాడని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ దాబర్ తెలిపారు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే శుక్రవారం లామ్టాలోని పంచాయతీ కార్యాలయం సమీపంలోని ఒక గోతిలో బ్యాగ్ కనిపించింది. స్థానికులు ఆ బ్యాగ్ గురించి పోలీసులకు తెలియజేశారు.
విచిత్రంగా ఆ బ్యాగ్‌లో ఆలయంలో కొట్టేసిన వస్తువులు ఉన్నాయి. అంతేకాదు ఆ దొంగ ఓ క్షమాపణ లేఖను కూడా రాసి ఆ బ్యాగ్‌లో పెట్టాడు. అందులో తాను చేసిన పనికి క్షమాపణలు కోరుతున్నానని రాశాడు. తాను తప్పు చేశానని అపరాధానికి భావాన్ని వ్యక్తం చేశాడు. "నా చర్యకు నేను క్షమాపణలు కోరుతున్నాను. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. దొంగతనం తర్వాత నేను చాలా బాధపడ్డాను." అని రాశాడు. ఆ లేఖను, దొంగలించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దొంగను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.