కొన్ని సన్నివేశాలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ అవి నిజజీవితంలోనూ చూస్తూ వస్తున్నాం. ఇదిలావుంటే బంధుమిత్రులతో కళ్యాణ మండపం కోలాహలంగా ఉంది. పురోహితులు వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల హోరు సాగుతుండగా.. ఎన్నో ఆశలతో కొత్త పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కింది. మరికొన్ని నిమిషాల్లో మాంగల్యధారణ జరుగుతుందనగా.. వధువు బంధువుకు వచ్చిన ఫోన్ కాల్‌తో పెళ్లి ఆగిపోయింది. ఇది వరకే వరుడికి పెళ్లయిందని తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు షాకయ్యారు. వెంటనే వధువు మండపం నుంచి కింద దింపేసి... మోసగాడ్ని గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అమ్మాయి కుటుంబం, బంధువులు గుణపాఠం చెప్పి, పోలీసులకు అప్పగించారు. సినిమాను తలపించే ఈ ఘటన బెంగళూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు చిక్కసంధ్రకు చెందిన నిందితుడు మధుసూదన్ మంచి వేతనంతో ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. నాలుగేళ్ల కిందట సమీప బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కట్నకానుకల కింద వాళ్లు భారీగానే ముట్టజెప్పారు. పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న దంపతుల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో ఆమె నుంచి దూరంగా ఉన్నా.. ఇంకా విడాకులు తీసుకోలేదు. అయినా సరే రెండో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
అదే ప్రాంతంలో పెళ్లి సంబంధాలు చూస్తే తెలిసిపోతుందని భావించిన మధుసూదన్.. హాసన్‌కు చెందిన అమ్మాయితో సంబంధం కుదుర్చుకున్నాడు. అక్టోబరు 28న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. పెళ్లికి ముందు రోజు గురువారం ఎంజీ రోడ్‌లో ఉన్న ఓ కళ్యాణమండపంలో రిసెప్షన్ జరిగింది. వివాహతంతు శుక్రవారం ఉదయం జరగనుండగా.. పెళ్లికి ఇరువైపుల నుంచి పెద్దఎత్తున బంధువులు తరలివచ్చారు. పెళ్లైన వెంటనే 29న మాల్దీవులకు హనీమూన్ కోసం విమాన టికెట్‌లు కూడా బుక్ చేశాడు.
అతడికి ఇది వరకే పెళ్లయి, భార్యతో విడాకులు తీసుకోలేదని వధువు బంధువుకు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. మొదటి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వాట్సాప్‌లో షేర్ చేశాడు. దీంతో వధువు కుటుంబం భిత్తరపోయింది. మెడలో తాళి పడక ముందే తెలియడంతో విషయం తెలియడం ఊరట చెందారు. మధుసూదన్‌ను పట్టుకుని బంధించారు. విషయం బయటపడిన వెంటనే అతడి తరఫు బంధువులు పిల్లిలా జారుకున్నారు. కొందరు పట్టుబడటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతిథుల కోసం చేసిన వంటకాలను హాసన్‌లో అమ్మాయి కుటుంబం పంచిపెట్టింది. ఆమె జీవితం నాశనం కాకుండా కాపాడినట్లయిందని బంధువులు తెలిపారు. దీనిపై హాసన్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అతడి కుటుంబసభ్యులను కూడా ఈ ఎఫ్ఐఆర్‌లో చేర్చినట్టు పోలీసులు వెల్లడించారు.